మ్యూజిక్ షాప్ మూర్తి లోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే – అజయ్ ఘోష్
music shop murthy succes celebrations held grandly
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ‘ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. సక్సెస్ అయిన వారెవరైనా ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే. డైరెక్షన్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన ఇన్ఫ్లుయన్సర్లు, పీఆర్ఓ సతీష్ గారికి కృతజ్ఞతలు’ అన్నారు.
మరో నటుడు నాని మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో డీజే సీన్ చాలా బాగా వచ్చిందని’ అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు విచ్చేసిన మీడియా వాళ్లందరికీ, తమ్మారెడ్డి భరద్వాజ గారికి థాంక్యూ. ఈ సినిమా కథ విన్నప్పుడే దీనిపై నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాగా ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే సినిమా అవుతుందని ముందే ఊహించాం. అదే జరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్న వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ శివ గారితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమా మిగితా భాషల్లో కూడా రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పీఆర్ఓ సతీష్ పాత్ర గొప్పది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మంచి సంగీతం అందించారు. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా బాగా కనిపించానని అంతా అంటున్నారు. అందుకు గాను డీఓపీ గారికి స్పెషల్ థ్యాంక్స్’ అన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూశా. ఈ అజయ్ ఘోష్ ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. మొన్న మిడ్ నైట్ మెలకువ రావడంతో ఈ సినిమా చూశా. 40 నిమిషాల సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. మంచివాళ్ళు కూడా ఏడిపించారు. ప్రతి క్యారెక్టర్ జస్టిఫికేషన్ తో కూడి ఉంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. మౌత్ పబ్లిసిటీతో సినిమా సక్సెస్ అవుతోంది. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్ళకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేయండి’ అన్నారు.
డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఇది. ఈ సినిమా తీశాక సినిమా ఎలా తీయాలి. కష్టనష్టాలు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తా’ అని అన్నారు.
ఈ సినిమాలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇతర ప్రధాన ఆకర్షణలు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.