Rakul Preet Singh as Surpanakha in Ramayanam – First Look Unveiled

Rakul Preet Singh as Surpanakha in Ramayanam – First Look Unveiled
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, నమిత్ మల్హోత్రా రామాయణం నుంచి జనస్థాన్ రాజకుమారి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. “జనస్థాన్కి రాజకుమారి.. శూర్పణఖ” అంటూ పరిచయం చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బంగారు వర్ణపు ఆభరణాలు, రాయల్ కాస్ట్యూమ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశంలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది.
ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్వీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపడుతోంది.
