బిగ్ స్ర్కీన్ పై ఆస్వాదించాల్సిన సినిమా “తంగలాన్”
తంగలాన్ మూవీ రివ్య్వూ
నటీనటులు – విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తదితరులు
సంగీత దర్శకుడు – జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ – ఏ కిషోర్ కుమార్
ఎడిటర్ – సెల్వ ఆర్ కే
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకుడు – పా. రంజిత్
విడుదల తేదీ – ఆగస్టు 15, 2024
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు)తో పాటు తన పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే… బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవాల్సి వస్తోంది. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం (కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ లో) వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్ కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. ఐతే, ఆ బంగారు గనులకి కాపాలా కాస్తున్న ఆరతి (మాళవిక మోహనన్) నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురు అవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలాన్ ఎవరు? అరణ్య (విక్రమ్) ఎవరు? అతనికి ఆరతికి మధ్య సంబంధం ఏమిటి ? చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.
నటీనటుల పెరఫామెన్స్
విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పాత్ర కోసం విక్రమ్ ఏ రేంజ్ హోమ్ వర్క్ చేస్తాడో తెలిసిన విషయమే. ఈ చిత్రంలోని క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ విక్రమ్ తన మార్క్ నటనతో విజృంభించాడు. మాళవిక మోహనన్ చక్కగా పెర్ పామ్ చేసింది. ముఖ్యంగా విక్రమ్, మాళవిక మోహనన్ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన చాలా బాగుంది. తంగలాన్ భార్య గంగమ్మ పాత్రలో పార్వతీ తిరువోతు జీవించింది. అలాగే పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక ఇతర కీలక పాత్రలను పోషించిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం
భారీ తారాగణం, రిచ్ గా సినిమాని తెరకెక్కించడం ఈ సినిమాకి ప్రధాన బలం. దర్శకుడు పా. రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. విజువల్ వండర్ లా సినిమాని తీర్చిదిద్దారు. పీరియాడిక్ నేపధ్యం కావడంతో ఆసక్తిగా ఉంది. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేసారు డైరెక్టర్. జి.వి. ప్రకాష్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్ వండర్ అని చెప్పాలి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఖర్చు వెనకాడకుండా, చాలా లావిష్ గా సినిమాని తెరకెక్కించిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని విధానం తెరపై కనిపించింది.
విశ్లేషణ
‘తంగలాన్’ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. విక్రమ్ నటన, కథా నేపథ్యం, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం నిరాశపరిచే విషయం. భారీ తారాగణం, విజువల్స్ కోసం ఈ సినిమాని ఆస్వాదించవచ్చు. ఫీరియాడిక్ సినిమాలకు కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. బిగ్ స్ర్కీన్ పై ఆస్వాదించాల్సిన సినిమా “తంగలాన్”
రేటింగ్ – 3/5