ఆయ్ పక్కా గోదావరి జిల్లాల సినిమా – నిర్మాత బన్నీ వాస్
కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు రావటం అరుదుగా మారుతున్న తరుణంలో, కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా, నవ్వుల పండుగను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమైంది ప్రెస్టీజియస్ బ్యానర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర యూనిట్ పిఠాపురంలో విడుదల చేసింది. ‘ఆయ్’ ట్రైలర్‌ను టీడీపీ నాయకులు వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. హీరో నార్నే నితిన్, నయన్ సారిక, నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ అంజి కె.మణిపుత్ర, కో ప్రొడ్యూసర్ బాలు, టీడీపీ నాయకుడు వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ‘‘నార్నే నితిన్ జూనియర్ ఎన్టీఆర్‌గారికి బావమరిది. తను హీరోగా నటిస్తోన్న మూవీ ‘ఆయ్’. బన్నీవాస్‌గారు ఇప్పటికే పదికి పైగా సినిమాలను నిర్మించారు. ఇప్పుడు వారి నిర్మాణంలో ‘ఆయ్’ సినిమా ఆగస్ట్ 15న వస్తుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గోదావరి జిల్లాల్లోని వారంతా ఆయ్ అని అంటుంటాం. అందులో పలకరింపు ఉంటుంది. కాస్త వెటకారం కూడా ఉంటుంది. సినిమా నేచురల్‌గా తీసినట్లు అనిపిస్తుంది. ‘ఆయ్’ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు.
ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘బన్నీవాస్ గారు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పాలిటిక్స్‌లో తనవంతు పాత్రను పోషిస్తుంటారు. నేను, ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్గానూ వర్క్ చేశాం. ఈ ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ తరపున ప్రచార బాధ్యతలను నిర్వహించారు. ఆయ్ సినిమా విషయానికి వస్తే గోదావరి జిల్లా నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నితిన్, నయన్ అనుభవమున్న నటీనటుల్లా నటించారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. బన్నీ వాస్గారికి ఈ సినిమా ఆర్థికంగా పెద్ద సక్సెస్ తెచ్చి పెట్టాలి. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు’’ అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘‘‘ఆయ్’..ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. సినిమా థియేటర్ నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని నేను గ్యారంటీగా చెప్పగలను. పిఠాపురంలో సినీ వేడుకను నిర్వహించి కొత్త అడుగుకి వేశాం. భవిష్యత్తులో ఈ బాటలో మరింత మంది అడుగులు వేస్తారని నమ్ముతున్నాను. రామ్ మిర్యాలగారిది పిఠాపురం అనేది నాకు తెలియదు. ఈ సినిమా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడే తెలిసింది. ఇక్కడ వ్యక్తి కాబట్టే నాయకి అనే సాంగ్‌తో పాటు మరో సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు’’ అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ‘‘నేను తెలుగు అమ్మాయిని కాకపోయినా ‘ఆయ్’ టీమ్‌తో వర్క్ చేయటం వల్ల తెలుగు అమ్మాయిగా మారిపోయాను. సినిమా గురించి చెప్పాలంటే.. గోదావరి జిల్లాల్లో ప్రజలు అన్నీ ఎమోషన్స్‌కు ఎలాగైతే ఆయ్ అంటారో.. అలాంటి ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అది మా టీమ్ చేస్తోన్న ప్రామిస్’’ అన్నారు.
నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ ‘‘ఓ దేశ రాజధానికున్న అటెన్షన్‌ను ఈరోజు పిఠాపురం సంపాదించుకుంది. ఎంతో మంది కోరికను ఇక్కడి ప్రజలు నేరవేర్చారు. అందరికీ థాంక్స్. బన్నీవాస్‌గారు పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ అనగానే ఆ కిక్కేవేరనిపించింది. ఇక్కడ ప్రేక్షకులు ఇచ్చే ఈ పవర్ అంతా మా మూవీకి ఆశీస్సులుగా మారి, మాకు కలెక్షన్స్ రూపంలో కనిపించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ ‘‘‘ఆయ్’ ట్రైలర్లో ఎంతగా నవ్వించామో, సినిమా అంతా అలాగే ఎంజాయ్ చేస్తారో. నవ్వుతూనే చిన్న చిన్న ఎమోషన్స్‌ను చూపించాం. నిర్మాత బన్నీవాస్‌గారు ఎంతో సపోర్ట్ అందించారు. రామ్ మిర్యాలగారికి థాంక్స్. ఆయన కంపోజ్ చేసిన రంగనాయకి, సూఫీ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అజయ్ అరసాడ సినిమాకు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. సినిమా కో ప్రొడ్యూసర్స్ రియాజ్, భాను ప్రతాప్‌గారికి, నిర్మాతల్లో ఒకరైన విద్యా కొప్పినీడిగారికి, చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌గారికి థాంక్స్’’ అన్నారు.
కో ప్రొడ్యూసర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ ‘‘పిఠాపురం పేరులోనే పవర్ ఉంది. మీకు మరో పవర్ యాడ్ అయ్యింది. మీరందరూ కలిసి ఈ సినిమాకు ఇంకా పవర్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ ‘‘‘ఆయ్’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మమ్మల్ని చెట్లు ఎక్కించటం, బురదలో పడేయటం వంటి పనులను మా డైరెక్టర్ చేశారు. ఆయనపై కోపాన్ని మళ్లీ తీర్చుకుంటాను. మా కష్టానికి ఫలితాన్ని మీరు అందరూ, సినిమా సక్సెస్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ ఉందంటే కారణం మా డైరెక్టర్, నిర్మాతలే. అంకిత్, కసిరెడ్డి లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. పిల్లర్స్‌లా వాళ్లు కష్టపడ్డారు. ఈ సందర్భంగా వాళ్లకి థాంక్స్. నయన్ సారిక తెలుగు అమ్మాయి కాకపోయినా, తను ఇరగ్గొట్టేసింది. రేపు సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ ‘‘‘ఆయ్’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. రేపు సినిమాను థియేటర్స్‌లో చూసేటప్పుడు ఒక్కరూ కూడా కూర్చోరు. కిందపడి నవ్వుతుంటారు. అందుకు నాదీ గ్యారంటీ. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతున్న సినిమాను మిస్ కాకుండా చూడండి’’ అన్నారు.