Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

మంగపతికి మెగా ప్రశంసలు
హీరో నాని నిర్మాణంలో వచ్చిన “కోర్టు” సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించింది. జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలలో కనిపించారు. అలాగే సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి, ఆకట్టుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో శివాజీ కేవలం నటించలేదు. ఆ పాత్రలో జీవించారు. తన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి జోలికి వచ్చాడని చందు అనే కుర్రాడిని ఇబ్బంది పెట్టే ఈ పాత్రలో ఆయన చూపించిన తీవ్రత, ఫెరోషియస్ నటన అందరి మనసులనూ ఆకర్షించింది. ఈ పాత్ర ద్వారా శివాజీ తన నటనా ప్రతిభకు మరోసారి తార్కాణం చాటారు.
నిజానికి మంగపతి పాత్ర ఒక సాధారణ విలన్ పాత్ర కాదు—అది ఒక సంక్లిష్టమైన, మల్టీఫేస్డ్ ఎమోషన్స్ తో కూడిన పాత్ర. శివాజీ ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన చూపుల్లోని కోపం, మాటల్లోని ఆధిపత్యం, చేష్టల్లోని దౌర్జన్యం—ఇవన్నీ కలిసి మంగపతిని తెరపై ఒక శక్తివంతమైన పాత్రగా నిలబెట్టాయి. చందుని ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను ఒక్కసారిగా ఆ పాత్రను ద్వేషించేలా, అదే సమయంలో ఆ నటనను మెచ్చుకునేలా చేసింది. అది శివాజీ నటనా సామర్థ్యానికి నిదర్శనం.
చిరంజీవి గారి అభినందనల వర్షం
“కోర్టు” సినిమా తాజాగా చూసిన మెగాస్టార్ చిరంజీవి, శివాజీ నటనకు పూర్తిగా ఫిదా అయ్యారు. వెంటనే ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి మంగపతి పాత్రలో శివాజీ చూపించిన లోతైన నటనను మెచ్చుకుంటూ, అభినందనల వర్షం కురిపించారు. “నీవు ఈ పాత్రలో నటించలేదు, జీవించావు. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలి,” అంటూ చిరంజీవి గారు శివాజీ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇద్దరూ కలిసి గతంలో “ఇంద్ర” సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.