ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే “పురుషోత్తముడు”
Purushothamudu movie review and rating
చిత్రం – పురుషోత్తముడు
నటీనటులు – రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీశర్మ, ముకేశ్ ఖన్నా తదితరులు
దర్శకుడు – రామ్ భీమన
నిర్మా తలు – రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్
విడుదల తేదీ – 26 జూలై, 2024
చిన్న సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగిన రాజ్ తరుణ్ కు ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కాస్త గ్యాప్ తీసుకొని పురుషోత్తముత్తుడు సినిమా చేసాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (26.7.2024)) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. తండ్రి రఘురామ్ (మురళీశర్మ) అతన్ని తన పరశురామయ్య ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి CEOని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసుంధర(రమ్యకృష్ణ). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు అభయ్ రామ్ (విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రామ్ కట్టుబట్టలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు.
రాజమండ్రి దగ్గరలోని కడియపులంక అనే గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో పూలతోటలు నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
రచిత రామ్ పాత్రకు రాజ్ తరుణ్ పూర్తి న్యాయం చేశాడు. యాక్టింగ్‌లో గతం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. లండన్ లో చదువుకున్న వ్యక్తి, పెద్ద కంపెనీకి సిఈఓ అవ్వాల్సిన వ్యక్తి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఒకరి దగ్గర పని చేసే వ్యక్తిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ హాసిని సుధీర్ గ్లామర్ తో యూత్‌ను ఎట్రాక్టు చేస్తుంది. ఇక సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వసుంధర పాత్రలో హుందాగా కనబడుతూనే. తనదైన శైలిలో ఆడియన్స్ ని మెప్పించారు. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం
విజువల్స్ పరంగా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటలు బాగున్నాయి. చివరిలో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ
హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలో అన్యాయానికి గురవుతున్న పేద ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి అండగా నిలబడతాడు. ఇలాంటి పాయింట్స్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా కథను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సీన్స్, స్ర్కీన్ ప్లే ఆసక్తిని కలిగిస్తాయి. దాంతో ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాటలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా పురుషోత్తముడు.
ఫిల్మీబజ్ రేటింగ్ – 3\5