సింబా – మంచి మెసేజ్ ఉందబ్బా
చిత్రం – సింబా
నటీనటులు – అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులుసంగీత దర్శకుడు – కృష్ణ సౌరభ్
కెమెరా – కృష్ణ ప్రసాద్
నిర్మాతలు – సంపత్ నంది, రాజేందర్ సంయుక్త
దర్శకత్వం – మురళీ మనోహర్ రెడ్డి
అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సింబా. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ చిత్ర కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ రోజు (9.8.2024) ఈ సినిమా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని మెప్పిస్తుందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
అక్ష(అనసూయ) బెస్ట్ టీచర్. ఎవ్వరికీ హాని చేయని శాంతి స్వభావి. తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో అన్నీ తానై ఇంటిని నడిపిస్తూ ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి అక్ష అనుకోకుండా ఓ రోజు రోడ్డు మీద ఓ వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తిని ఫాలో అయ్యి అతి దారుణంగా చంపేస్తుంది. ఈ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) విచారణ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్ష మరో వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమెతో పాటు ఫాజిల్ కూడా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత వీరిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కూడా జాయిన్ అవుతాడు. ముగ్గురు కలిసి మరో వ్యక్తిని చంపుతారు. ముగ్గురిలోనూ ఒకే రకమైన మార్పు కనబడుతుంది. ఈ ముగ్గురిలో వచ్చిన మార్పు ఏంటి? ఈ ముగ్గురికీ, పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలతో సినిమా తెరకెక్కింది.
నటీనటుల పెరఫామెన్స్
అనసూయ కీలక పాత్ర చేసింది. ఓ మంచి టీచర్ గా పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. మరోవైపు హత్య చేస్తున్న వ్యక్తిగా కిల్లర్ పెర్ ఫామెన్స్ చేసింది. యాక్షన్ సీన్స్ లో వైల్డ్ గా అదరగొట్టేసింది. జగపతి బాబు పాత్ర సినిమాకే హైలైట్ గా ఉంది. పర్యావరణ ప్రేమికుడిగా జగపతిబాబు కొత్తగా కనిపించాడు. సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో వసిష్ఠ సింహ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మరో కీలక పాత్రలో కనిపించిన శ్రీనాథ్ కూడా బాగా నటించాడు. హీరోయిన్ దివి ఆకట్టుకుంది. అనీష్ కురువిళ్ళ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. గౌతమి, కస్తూరి, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
మంచి మెసేజ్ తో ఈ కథ తెరకెక్కింది. సాంగ్స్ బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ అన్ని న్యాచురల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ
సెల్యులార్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. వైల్డ్ రివేంజ్ స్టోరీ ప్లేతో సాగిన ఈ సింబా చిత్రంలో మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. మంచివాళ్ళుగా ఉన్న వ్యక్తులు సడెన్ గా అతి దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నారు? అనే కోణాన్ని ఆసక్తికరంగా చూపించారు. కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. సో… మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాని మిస్ అవ్వద్దు.
రేటింగ్ – 3/5