వినోదం పంచే “బడ్డీ”
Buddy Movie Review and Rating
నటీనటులు – అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ముకేష్ రుషి, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
రచన: సాయి హేమంత్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శామ్ ఆంటన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
ఆదిత్య (అల్లు శిరీష్) ప్రొఫెషనల్ గా పైలట్. ఎయిర్ పోర్టులో ఏటీసీగా చేరిన ప్రియ(గాయత్రి భరద్వాజ్)తో ఆదిత్య కు పరిచయం ఏర్పడుతుంది. వర్క్ పరంగాను, ప్రతి విషయంలోనూ తనకు అండగా నిలిచిన ఆదిత్య ను ప్రేమిస్తుంది ప్రియ. ఆమెను ఆదిత్య కూడా ఇష్టపడతాడు. అనుకోకుండా ప్రియ మెడికల్ మాఫియా వలలో చిక్కుకుని కోమాలోకి వెళ్లిపోతుంది. ఆ స్థితిలో ఆదిత్య ఒకప్పుడు బహుమతిగా ఇచ్చిన టెడ్డీ బేర్లోకి ప్రియ ఆత్మ వెళ్తుంది. ఆ తర్వాత ఈ టెడ్డీ బేర్.. ఆదిత్యతో స్నేహం చేసి ప్రియను కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నం ఎంతమేర సఫలమైంది… ఇంతకీ మెడికల్ మాఫియా చేస్తున్న స్కామ్ ఏంటి… ప్రియ బాడీతో వాళ్లు ఏం చేయాలనుకున్నారు అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
నటీనటులు, సాంకేతికవర్గం
ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ హుందాగా కనిపించాడు. తన పాత్రలో లీనమై, హావభావాలు పలికిస్తూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కు కథలో కీలక పాత్రే దక్కింది. లుక్స్ బాగున్నాయి. విలన్ అజ్మల్ అమీర్ బాగానే చేశాడు. ముకేష్ తనకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కనిపించాడిందులో. కామెడీ టచ్ ఉన్న తన పాత్ర పర్వాలేదు. ఆలీ ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చి నవ్వించాడు. ఓవరాల్ గా తమ పాత్రల పరిధిమేరకు నటీనటులందరూ మంచి పెర్ ఫామ్ చేసారు. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకి సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్ పరంగా కూడా సినిమా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ
అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అజ్మల్ అమీర్ పాత్ర బాగుంది. ఊహించని ట్విస్ట్ ఇస్తూ హీరోయిన్ జీవితంలోకి టెడ్డీబేర్ వస్తుంది. అక్కడి నుంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సన్నివేశాలుంటాయి. టెడ్డీబేర్ అల్లు శిరీష్ దగ్గరకు రావడం.. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఫైట్ సన్నివేశాలతో సాగుతుంది. టెడ్డీబేర్ ఎలా జీవం పోసుకుందో తెలుసుకుంటాడు అల్లు శిరీష్. ఈ క్రమంలో వచ్చే సీన్లు సన్నివేశాలు టెడ్డీ లోపల ఉన్న వ్యక్తిపై ఫోకస్ పెట్టే సన్నివేశాలుంటాయి. కొన్ని వినోదాత్మక అంశాలతో అల్లు శిరీష్, టెడ్డీ బేర్ మధ్య వచ్చే సన్నివేశాలు థ్రిల్ కు గురి చేస్తాయి. సెకండాఫ్‌లో కథ హాంకాంగ్‌కు మారుతుంది. రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించడం.. టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం.. రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయడం.. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ప్రయత్నించడం సన్నివేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
ఓవరాల్ గా ఈ సినిమాని పిల్లలతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. సో… మిస్ అవ్వద్దు.
రేటింగ్ : 3/5