రహస్యం ఇదం జగత్ మూవీ రివ్య్వూ
సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం రహస్యం ఇదం జగత్. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించే చిత్రం రహస్యం ఇదం జగత్. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాని సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి కొనుగోలు చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి నవంబరు 8న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
రహస్యం ఇదం జగత్ కథ
అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్న అభి(రాకేష్) తన గర్ల్ ఫ్రెండ్ అకీరా(స్రవంతి) తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి కోసం ఇండియా షిఫ్ట్ అయిపోదాం అని ఫిక్స్ అవుతాడు. అయితే వెళ్లే ముందు పాత ఫ్రెండ్స్ తో సమయం గడపాలని ఒక సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అటవీ ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయాల్సి వస్తుంది. అక్కడికి మరో జంటతో పాటు అకిరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. చిన్న చిన్న మాటలతో మొదలై అకిరా కోసం అభి విశ్వ మధ్య గొడవ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకొని ఆకీరా, కళ్యాణ్ లను విశ్వ చంపేస్తాడు. అయితే మల్టీ యూనివర్సిటీ గురించి రీసర్చ్ చేసే మెడికల్ ఎక్విప్మెంట్ డిజైనర్ అయిన అరు తనున్న ప్రదేశంలోనే మల్టీ యూనివర్స్ కి వెళ్లే దారి ఉందని తెలుసుకుని అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమెను ఎవరో గన్ తో పేల్చి చంపుతారు. అయితే వారందరినీ మళ్లీ బతికించుకోవడం కోసం అభి మల్టీ యూనివర్స్ లోకి వెళ్లే వార్మ్ హోల్ లోకి వెళతాడు. అసలు అభి ఆ వార్మ్ హోల్ లోకి ఎలా వెళ్ళాడు ? చివరికి అభి తన స్నేహితులను మళ్ళీ బతికించుకున్నాడా? వాళ్లు ఇండియా తిరిగి వెళ్లారా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. టైం ట్రావెల్ గురించి సినిమా ఉంటుందేమో అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాని కూడా దాదాపుగా వార్మ్ హోల్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అయితే దానికి కృష్ణుడిని, శ్రీ చక్రం గురించి ఆంజనేయ స్వామి కనెక్షన్ తీసుకుని మైథాలజీతో టచ్ చేశారు. సినిమా మొదలైన తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్లడం అక్కడ గొడవలు వారి మధ్య గిల్లికజ్జాలతో తెరకెక్కింది. అయితే ఇంటర్వెల్ ముందు అభి ఫ్రెండ్స్ చనిపోయి అభి, ఆరు కలిసి ఏం చేయబోతున్నారనే విషయంతో ఆసక్తి రేకెత్తించారు.
ఇక సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక ఆ వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిన అభి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఎలా కాపాడుతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఫర్వాలేదనిపించినా… సెకండ్ హాఫ్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లేతో ఆసక్తిగా సాగుతుంది.
ఇక నటినటులు పర్ఫామెన్స్ విషయానికొస్తే హీరోగా నటించిన రాకేష్ తన పాత్రలో ఇమిడిపోయాడు. తన నట అనుభవం స్క్రీన్ మీద కనిపించింది. స్రవంతి క్యూట్‌గా కనిపిస్తూనే తనదైన శైలిలో నటించింది సైంటిస్ట్ పాత్రలో నటించిన అరు చూడడానికి హాలీవుడ్ ఆర్టిస్ట్ లాగానే ఉండి ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి టెక్నికల్ యాస్పెక్ట్స్ ప్రధానమైన బలం అమెరికాలో ఎన్నో లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఆ లొకేషన్స్ కి అందం తీసుకువచ్చింది. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం లౌడ్ అనిపించింది. నిర్మాణ పరంగా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా కనిపించాయి.
రొటీన్ కి భిన్నంగా తెరకెక్కిన సినిమా రహస్యం ఇదం జగత్.
రేటింగ్ – 3\5