
ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాపై ₹2 కోట్ల పెట్టుబడి – న్యాయం జరిగే వరకు పోరాడుతాం – నిర్మాతలు
ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమా నిర్మాణంలో నిర్మాతలు కే. మురళి (శరత్ వర్మ), బి. ఆనందబాబు తమపై పెద్ద మోసం జరిగిందని మీడియా ముందుకు వచ్చారు. “సినిమా కోసం మేము రూ.2 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. మొత్తం ఖర్చు మేమే భరించాం. తిరిగి ఇవ్వలేకపోవడంతో సంబంధిత వ్యక్తి 2024 సెప్టెంబర్ 12న మా పేర్లపైకి సినిమా రైట్స్, కాపీరైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా రిలీజ్ పనులు కొనసాగుతున్నాయి.
కానీ సహకరించాల్సిన రామకృష్ణ తోట మాపై విశ్వాస ఘాతుకం చేశాడు. సినిమా తనదేనని ప్రకటించి, అనుమతి లేకుండా టైటిల్, పోస్టర్లను పత్రికల్లో ప్రచురించాడు. ఇది మా హక్కులపై దాడి, మోసం. ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. “రామకృష్ణ తోటపై IPC 406, 420 (మోసం, విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద, అలాగే కాపీరైట్ చట్టం 1957 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గం” అన్నారు.
“సినిమా రంగంలో పెట్టుబడి పెట్టేవారి హక్కులు రక్షించకపోతే ఈ రంగం నాశనం అవుతుంది. సినిమా హక్కులు అతిక్రమించిన కుట్ర ఇది. నిర్మాత మండలి మాకు న్యాయం చేయాలి.
ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. మీడియా మిత్రులు ఈ విషయం ప్రజలకు చేరేలా చేయాలి. మా న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని నిర్మాతలు స్పష్టం చేశారు.