Haiku Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and

అక్షరాలకు ఆత్మ నింపిన కళాకారుడు వివ రెడ్డి కి చార్లీ చాప్లిన్ అవార్డు
సినిమా తెరపై కనిపించే ప్రతి అక్షరానికి ఒక జీవం ఉంటే, ఆ జీవానికి రూపం ఇచ్చే కళాకారుడు వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు). అక్షరాలను అలంకరించే చేతి గీతల్లో భావాలను పలికించగల అరుదైన సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిన ఆయనకు, ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ 137వ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మక చార్లీ చాప్లిన్ అవార్డు లభించింది. రవీంద్రభారతీ వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో, తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షులు డా. బండ ప్రకాష్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేతుల మీదుగా ఈ గౌరవం వివ రెడ్డి కి అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ – మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న సృజనాత్మక ప్రయాణంలో అక్షరాలకు అందం, సినిమాకు ఆత్మ, ప్రేక్షకుడికి అనుభూతి ఇచ్చిన కళాకారుడిగా వివ రెడ్డి నిలిచారని కొనియాడారు. ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా అందుకున్న ఈ గౌరవం, తెలుగు సినీ అక్షర రూపకల్పన కళకు లభించిన గుర్తింపుగా నిలిచిందని అన్నారు. వివ రెడ్డి కళా కాంతి మరింత విస్తరించి, ఆయన సృజనాత్మక ప్రయాణం కొత్త శిఖరాలను అధిరోహించాలని రోజా క్రియేషన్స్ నిర్వహకులు ఆకాంక్షించారు.
ఆరు వందల చిత్రాలకు అక్షర శిల్పం
చిన్ననాటి చిత్రలేఖనపు అమాయక ఆసక్తితో ప్రారంభమైన ప్రయాణం.. కాలక్రమేణా లోగో రూపకల్పనలో నైపుణ్యంగా వికసించి, పబ్లిసిటీ రూపకల్పనలో ప్రత్యేక గుర్తింపును సాధించి, నటనలోనూ తన అభిరుచిని ప్రతిబింబించిన కళాకారుడిగా వివ రెడ్డి ఎదిగారు.
“దిల్”తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం, “శివమణి”, “అర్జున్”, “చంద్రముఖి”, “సింహ”, “ఒక్కమగాడు”, “పరమవీరచక్ర”, “బొమ్మరిల్లు”, “పరుగు”, “శంకర్ దాదా జిందాబాద్”, “గుడుంబా శంకర్”, “దేశముదురు”, “పోకిరి”, “రక్తచరిత్ర”, “సూపర్”, “రెడీ”, “ప్రస్థానం”, “బ్లేడ్ బాబ్జీ”, “ఆర్య 2”, “ఆపరేషన్ దుర్యోధన” వంటి అనేక విజయవంతమైన చిత్రాల వరకు విస్తరించింది. సుమారు ఆరు వందలకు పైగా చిత్రాలకు ఆయన రూపొందించిన టైటిల్స్ తెరపై పదాలుగా మాత్రమే కాకుండా భావాల ప్రతిరూపాలుగా నిలిచాయి. వివ రెడ్డి చేతుల్లో పుట్టిన ప్రతి అక్షరం ఒక కథ. ప్రతి సినిమా ప్రేక్షకుడి మనసును తాకే తొలి అనుభూతి.
పబ్లిసిటీ రూపకర్తగా కూడా వివ రెడ్డి తన ప్రత్యేక శైలిని ప్రతిష్ఠించారు. “బంగారుకొండ”, “జై బోలో తెలంగాణ”, “లగ్గం”, “బాపు”, “రుద్రంగి”, “సోదర సోదరీమణులారా” వంటి వందకు పైగా చిత్రాలకు ఆయన అందించిన రూపకల్పనలు సినిమాకి ముందే ప్రేక్షకుల హృదయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
నాలుగు రంగాల్లో ప్రతిభా వైవిధ్యం
చిత్రలేఖనం, లోగో రూపకల్పన, పబ్లిసిటీ రూపకల్పన, నటన.. ఈ నాలుగు రంగాల్లోనూ ఆయన చూపిన ప్రతిభ కళా వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. ఫైన్ ఆర్ట్స్ విద్యతో పదును పెట్టుకున్న నైపుణ్యం, కృషి, పట్టుదలతో అవకాశాలను ఆహ్వానించుకుని ఆయన సాగించిన ప్రయాణం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
