Sumanth Prabhas Birthday Special Poster Released from Romanchakam

ఓ.! సుకుమారి వినోదం, ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ – తిరువీర్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ నుంచి వరుసగా సినిమాలు విడుదల కావడం ఎలా అనిపిస్తోంది?
నటుడిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మనతో సినిమా చేసిన నిర్మాత బాగుండాలి, దర్శకుడికి మంచి పేరు రావాలి, ప్రేక్షకులు ప్రతి సినిమాను ఆదరించాలని కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఈ ఏడాది నా నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు నా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇకపై కూడా నా ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను.
ఐశ్వర్య రాజేష్ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
మన కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం కూడా ఇంకా బాగా నటించడానికి ప్రయత్నిస్తాం. ఒక నటుడికి ఎదుటి నటుడి రియాక్షన్‌ను బట్టి కూడా నటించే అవకాశం పెరుగుతుంది. ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ గారు, నిత్యా మీనన్ గారు లాంటి మంచి నటీమణులతో పనిచేయడం ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. వాళ్లతో కలిసి పనిచేసినప్పుడు మన నటన కూడా మరింత మెరుగవుతుంది.
-ఇంతకుముందు ఐశ్వర్య గారితో ‘టక్ జగదీష్’ సినిమాలో పనిచేశాను. కానీ హీరో, హీరోయిన్గా కలిసి నటించడం మాత్రం ఈ సినిమాతోనే జరిగింది. ఈ సినిమాలో పనిచేసిన చాలామందితో గతంలోనే కలిసి పనిచేయడం వల్ల సెట్లో చాలా కంఫర్ట్‌గా అనిపించింది.
ఐశ్వర్య గారితో సీన్స్ చేసేటప్పుడు చాలా విషయాలు చర్చించేవాళ్లం. ఆమె తన అనుభవాలను నాతో పంచుకునేవారు. అది నాకు చాలా ఉపయోగపడింది.
ఈ కథను తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించడానికి కారణం?
-మా దర్శకుడు భరత్ దర్శన్ గారు సిద్ధిపేటకు చెందినవారు. ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ ప్రాంతాల కథలు, పాత్రలను చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడిగా నాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు… ఇలా అన్ని ప్రాంతాల యాసల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
‘ఓ.! సుకుమారి’ కథను ఒక్క లైన్లో చెప్పాలంటే?
-ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆమె ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా? అనేదే కథ. చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది.
నిజానికి ఇది ఒక అరుదైన పరిస్థితి ఆధారంగా రూపొందించిన కథ. ఇందులోని కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది.
ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
-ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంత నవ్విస్తుందో, అంతే భావోద్వేగానికి గురి చేస్తుంది. మంచి హ్యూమర్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను కదిలిస్తాయి. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా అందరికీ నచ్చుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మీరు కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉన్నారని అనిపిస్తుందా?
-నెలకు దాదాపు 20 కథలు వింటుంటాను. దర్శకులు, నిర్మాతలు నాతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక నటుడితో సినిమా చేస్తే బిజినెస్ అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడే వాళ్లు మన దగ్గరకు వస్తారు. ఆ లెక్కన నేను కంఫర్టబుల్ ప్లేస్లోనే ఉన్నాను.
మీరు నాటకాలు రాసేవారు. సినిమాలకు కూడా రాసే ఆలోచన ఉందా?
నాటకం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సినిమా మరో ప్రత్యేకమైన మాధ్యమం. నాటకాలు రాసేటప్పుడు ఒక చిన్న కథను తీసుకుని నటీనటులతో కలిసి ఇంప్రొవైజ్ చేసేవాడిని. సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత, భారీ వ్యయంతో కూడుకున్నది. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాను.
మీకు ఏ జోనర్ సినిమాలు చేయడం ఇష్టం?
డ్రామా జోనర్ నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్రలకు నేను బాగా సరిపోతానని అనుకుంటాను.
సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూశారా?
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండానే సినిమా చూశాను. ఒక సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండానే కనెక్ట్ అయితే అది మంచి సినిమా అని నా నమ్మకం. ‘ఓ.! సుకుమారి’ కూడా అలాగే అనిపించింది. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం వచ్చింది.
దర్శకుడు భరత్ దర్శన్ గురించి?
భరత్‌కు కమర్షియల్ పల్స్ చాలా బాగా తెలుసు. ఆయన ముందుగా ఒక మంచి ప్రేక్షకుడు. థియేటర్లో ప్రేక్షకులు ఎక్కడ చప్పట్లు కొడతారో ఆయనకు బాగా తెలుసు. హరీష్ శంకర్ గారి దగ్గర పనిచేసిన అనుభవం కూడా ఉంది. భవిష్యత్తులో మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడని నమ్ముతున్నాను.
ఈ సినిమా తమిళంలో కూడా విడుదలవుతోంది. ఎలా అనిపిస్తోంది?
నా సినిమా తమిళంలో విడుదల కావడం ఇదే మొదటిసారి. అక్కడి ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తే మరో భాషలో కూడా అవకాశాలు వస్తాయి. గతంలో తమిళం నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను.
షూటింగ్ కంటే ప్రమోషన్స్ కష్టంగా అనిపిస్తున్నాయా?
సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ప్రమోషన్స్ మరో ఎత్తు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నటన కంటే ప్రమోషన్స్ చేయడమే ఎక్కువ ఛాలెంజింగ్‌గా ఉంది.
మీ సినిమాల్లో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. దాని గురించి?
నేను ఎక్కడికి వెళ్లినా చాలామంది “మీ సినిమాలు బాగుంటాయి” అని చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నేను చేసిన పాత్రల గురించి మాట్లాడుతుంటారు. మహిళలకు సినిమా నచ్చితే కుటుంబమంతా చూస్తుంది. ఆ లెక్కన నేను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యానని భావిస్తున్నాను. ‘ఓ.! సుకుమారి’తో మరింత దగ్గరవుతానని నమ్ముతున్నాను.
చాలా ఇళ్లలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ‘మసూద’, ‘ఫ్రీ వెడ్డింగ్’ లాంటి సినిమాలు పెట్టమని అడుగుతుంటారని చెబుతుంటారు. అలాగే ‘ఓ.! సుకుమారి’ కూడా అందరికీ ఇష్టమైన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
కొత్త ప్రాజెక్టులు?
‘భగవంతుడు’తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాను. వాటి వివరాలను త్వరలో మేకర్స్ ప్రకటిస్తారు. అలాగే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్
థాంక్యూ
