
రాజా ది రాజా ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది – రవిశంకర్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడం ద్వారా, సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన ప్రచార కార్యక్రమాలతో మంచి అంచనాలను నెలకొల్పిన తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ట్రైలర్ కథను ఆసక్తికరంగా పరిచయం చేసింది. రాజరిక కాలంలో సాయికుమార్ రాజా వీరాట వర్మ దేవరాయగా కనిపిస్తారు. సంప్రదాయాలను గౌరవించే రాజ్యంలో, ఆధ్యను ప్రాణంగా ప్రేమించే హీరోపై రాజ్యంలో జరిగిన కల్లోలానికి కారణమని నేరం మోపి మరణశిక్ష విధిస్తారు. ఆ తర్వాత వర్తమాన కాలంలో హీరో ఫ్యాషన్ డిజైనర్‌గా, ఆధ్య మోడల్‌గా మళ్లీ పుడతారు. విధి వారికి మరో అవకాశం ఇస్తుంది. ఈసారి వారి ప్రేమ గెలుస్తుందా? గత జన్మలో మిగిలిపోయిన కథకు ముగింపు పలుకుతాడా? అనేదే సినిమా ప్రధాన కథాంశం.
తొలి సినిమానే అయినప్పటికీ రుత్విక్ రెండు భిన్నమైన పాత్రల్లో ఎంతో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. పీరియాడిక్ ఎపిసోడ్స్‌లో రాజకుమారుడి హుందాతనాన్ని, ప్రస్తుత కాలంలో స్టైలిష్, ఎనర్జిటిక్ యువకుడిగా చక్కగా కనిపించారు. విశాఖ ధీమన్ కూడా రెండు పాత్రల్లో చక్కగా మెప్పించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచింది. సాయికుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, డాక్టర్ నరేష్ విజయకృష్ణ కూడా తన పాత్రలో మంచి నటన కనబరిచారు.
దర్శకుడు అన్నిల్ బోయిడాపు పునర్జన్మ, ప్రేమ, ఎమోషన్లను కలిపి రెండు కాలాల మధ్య కథను ఆసక్తికరంగా నడిపించిన తీరు బాగుంది. రొమాన్స్, మిస్టరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్‌తో కూడిన ప్రయాణాన్ని సినిమా అందించబోతుందనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వృందావన్ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి.
ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ పసుపులేటి రూపొందించిన రాజభవనాల సెట్స్ పీరియాడిక్ ఎపిసోడ్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ బోయిడాపు రాజరిక కాలం, ఆధునిక కాలం మధ్య ఉన్న విజువల్ డిఫరెన్స్‌ను చాలా అందంగా చూపించారు. మార్క్ కె. రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేయగా, సాయి బాబు తలారి ఎడిటింగ్ ట్రైలర్‌ను ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లింది. మొత్తంగా చూస్తే, ఆసక్తికరమైన కథ, మంచి విజువల్స్, ఎమోషన్స్, బలమైన టెక్నికల్ వర్క్‌తో “రాజా ది రాజా” ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. మరో పది రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రాజా ది రాజా’ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ సినిమా హీరో రుత్విక్ గారితో పాటు నిర్మాత నిహారిక గారు కూడా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇందులో పాటలు చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాలోని విజువల్స్‌లా అనిపిస్తున్నాయి. అనిల్ చాలా అద్భుతంగా ఈ సినిమా తీశాడు. ట్రైలర్లో రుత్విక్ యాక్టింగ్ చూస్తుంటే అసలు కొత్త హీరో చేస్తున్నట్లు అనిపించలేదు. చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్ నటించినట్లు అనిపించింది. ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంది. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. రొమాన్స్, కామెడీ చేయడం చాలా కష్టం. చాలా టాలెంట్ ఉంటే గానీ ఆ ఎక్స్ప్రెషన్స్ రావు. ట్రైలర్లో చూస్తుంటే తనలో చాలా ఈజ్ కనిపించింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది మొత్తం ఒక టీమ్ ఎఫర్ట్లా అనిపించింది. నిహారిక గారు తన తొలి సినిమాకి ఎక్కడా క్వాలిటీలో రాజీపడలేదు. ట్రైలర్ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా మంచి సినిమా చేశారనే ఫీలింగ్ కలిగింది. తప్పకుండా జూలై 17న అందరం థియేటర్లలో ఈ సినిమా చూద్దాం.”
హీరో రుత్విక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రాజా ది రాజా’ సినిమా ద్వారా నేను నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాను. ఈ జర్నీ చాలా ఎమోషనల్. అనిల్‌తో కలిసి సినిమా చేయడం చాలా అద్భుతమైన అనుభూతి. ప్రేక్షకులను అలరించేలా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ప్రతి బ్రదర్‌కు నిహారిక లాంటి సిస్టర్ ఉండాలి. తనే నా బలం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మైత్రి రవి గారికి, నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. సాయికుమార్ గారికి, నరేష్ గారికి, అవసరాల శ్రీనివాస్ గారికి, భద్రం గారికి, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నరేష్ గారు, సాయికుమార్ గారు, మంజు భార్గవి మేడమ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా హీరోయిన్ విశాఖ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. జూలై 17న తప్పకుండా మీరందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత నిహారిక దాసరి మాట్లాడుతూ.. రవిగారికి, నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఈ సినిమా రిలీజ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ ఫిలిం. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమా తీశారు. సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాయికుమార్ గారికి, నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రుత్విక్, విశాఖ ఇద్దరూ అద్భుతంగా నటించారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడండి. జూలై 17న మీరందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ.. టీజర్ వచ్చినప్పటి నుంచి సినిమాకి చాలా మంచి పేరు వస్తోంది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు రవి గారికి, నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి సినిమా ప్రతి దర్శకుడికి చాలా ప్రత్యేకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి ధన్యవాదాలు. రుత్విక్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన చాలా ప్యాషన్ ఉన్న నటుడు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.”
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు రుత్విక్ నటన చూసి, తొలి సినిమాకే ఇంత అద్భుతంగా చేస్తున్నాడా అనిపించింది. తను అమెరికాలో యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు. మంచి ప్యాషన్‌తో ఈ ఇండస్ట్రీలో ఒక మంచి నటుడు అవ్వాలని వచ్చారు. నిజంగా తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలోని ప్యాషన్ నాకు చాలా గుర్తుండిపోయింది. తను మంచి హీరోగా పేరు తెచ్చుకుని, తనలోని నటన వైవిధ్యాన్ని మనందరం చూసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థాంక్యూ సో మచ్. విజువల్‌గా, కథపరంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది మనందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ పేరు: బృందావన్ క్రియేషన్స్
సమర్పణ: కె శ్రీలత రెడ్డి
నిర్మాత: కె. నిహారిక దాసరి
దర్శకత్వం: అన్నీల్ బోయిదాపు
డీవోపీ: రవికిరణ్ బోయిడపు
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: సాయి బాబు తలారి
ఆర్ట్ డైరెక్టర్: విజయ్ కుమార్ పసుపులేటి
పీఆర్వో: వంశీ -శేఖర్
