Masthugundira Yavvaram From Havish, Kavya Thapar’s Nenu Ready Unveiled

తలసేమియా రన్ ఒక ఈవెంట్ కాదు.. ఒక మూమెంట్: నారా భువనేశ్వరి
తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన 3K, 5K, 10K తలసేమియా రన్ విజయవంతంగా జరిగింది. యువత, ప్రజలు పెద్ద ఎత్తున ఈ రన్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ఫ్లాగ్ ఆఫ్ చేసి రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా ట్రస్ట్‌కు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు మనమందరం ఇక్కడికి ఒక గొప్ప కారణంతో పరిగెత్తడానికి వచ్చాం. ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన బాల్యాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాడు. ప్రతి 20 రోజులకు అతనికి రక్త మార్పిడి చేయాల్సి వస్తోంది. ఇదే తలసేమియా. తలసేమియాను మనం నివారించవచ్చు. అవగాహనతో దీన్ని ముందుగానే అడ్డుకోవచ్చు. పెళ్లికి ముందు చేసుకునే ఒక చిన్న రక్త పరీక్ష ఒక జీవితాన్ని కాపాడగలదు. భవిష్యత్తును రక్షించగలదు.
ఈ రన్ కేవలం ఒక ఈవెంట్ కాదు… ఒక మూమెంట్. తలసేమియాపై అవగాహన కల్పించడానికి, వాలంటరీ బ్లడ్ డొనేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మన ప్రయత్నం. మీరు దానం చేసే ప్రతి రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుంది. తలసేమియా బాధిత చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం.
ఈరోజు మీరు పరిగెత్తేది కాళ్లతో కాదు… మనసుతో. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం మీరు పరిగెత్తండి. భవిష్యత్తులో మరెవరూ ఇలా బాధపడకూడదనే సంకల్పంతో పరిగెత్తాలి. ఇక్కడికి వచ్చిన యువతకు, ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు”.
తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ స్టార్ క్రికెటర్ మిథాలి రాజ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, సైబరాబాద్ సీపీ రమేష్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో,రిటైర్డ్ IPS కె. రాజేంద్ర కుమార్, హీరోయిన్ మానస వారణాసితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
