Lovely Number Bhalle Bhalle From Nari Nari Naduma Murari Unveiled

అంగరంగ వైభవంగా భావ రస నాట్యోత్సవం – సీజన్ 1
‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’ అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించబడినవి.
ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ గారు భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ గారు మోహినియాట్టం ప్రదర్శన చేశారు. ఇక హైదరాబాద్ కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ గారు భరతనాట్య ప్రదర్శన చేశారు. ఈ ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఫీనిక్స్ గ్రూప్ కి చెందిన ఎమెరిటస్ చైర్మన్ శ్రీ సురేష్ చుక్కపల్లి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్ గారు ఘంభీరనట్టై రాగంలో స్వరపరిచిన ‘శ్రీ విఘ్నరాజం భజే’ అనే గణేశ కృతితో సౌజన్య శ్రీనివాస్ గారు నృత్య ప్రదర్శనను గొప్పగా ఆరంభించారు.
అనంతరం ఒక్కొక్కరిగా వేదికపై నర్తించి ఆ నటరాజే మురిసిపోయేలా చేశారు. శ్రీ త్రిశూర్ మోహన్ కుమార్ గారు సరమతి రాగంలో స్వరపరిచిన మోహినీయాట్టం వర్ణం శ్రీమతి స్వర్ణ రాజేంద్ర గారిచే ప్రదర్శించబడినది. రాగమాలిక రాగంలో శ్రీ ఆదిశంకరాచార్య స్వరపరిచిన అర్ధనారీశ్వర స్తోత్రంకు సౌజన్య శ్రీనివాస్ గారు భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రాగమాలిక రాగంలో శివప్రసాద పంచకంకు శ్రీమతి మంజు నాయర్ గారు భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు.
సింహేంద్ర మధ్యమం రాగంలో స్వరపరిచిన అష్టపదికి శ్రీమతి మంజు నాయర్ గారు భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. శ్రీ రాగంలో స్వరపరిచిన త్యాగరాజ కృతి అయిన ఎందరో మహానుభావులకు సౌజన్య శ్రీనివాస్ గారు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. శుద్ధసారంగ రాగంలో స్వరపరిచిన ఆంజనేయ కీర్తనకు శ్రీమతి మంజు నాయర్ గొప్ప ప్రదర్శన ఇవ్వడం జరిగింది. భూపాల రాగంలో మోహినియాట్టం తిల్లానాకు శ్రీమతి స్వప్న రాజేంద్ర గారు అద్భుత ప్రదర్శన ఇచ్చారు.
అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టింది.
