నేను – కీర్తన : పక్కా పైసా వసూల్ సినిమా
చిత్రం – నేను కీర్తన
నటీనటులు – రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు
బ్యానర్ – చిమటా ప్రొడక్షన్స్
ఫైట్స్ – నూనె దేవరాజ్,
సినిమాటోగ్రఫీ – కె.రమణ
ఎడిటర్ – వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్ – ఎమ్.ఎల్.రాజా
సమర్పణ – చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత – చిమటా లక్ష్మీ కుమారి
రచన – దర్శకత్వం – చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
విడుదల తేది: 30-08-2024
నేను – కీర్తన సినిమా ఇటీవల కాలంలో పెద్ద చిత్రాలకు ధీటుగా వార్తల్లో నిలిచింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. స్వయంగా కథ – మాటలు – స్క్రీన్ ప్లే సమకూర్చుకుని.. చిమటా రమేష్ బాబు డైరెక్టర్ కమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “నాన్ స్టాప్ ఎంటర్’టైనర్”… “పైసా వసూల్ ఫిల్మ్” అంటూ చిత్రబృందం చేసిన ప్రచారానికి తగ్గట్టుగానే సినిమా ఉందా లేదా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
జానీ అనే యువకుడి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తన కళ్ల ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారికి సహాయం చేయడంలో ముందుంటాడు. జానీ జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాక… అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది, తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా… సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించాడన్నదే ఈ చిత్ర కథ.
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్:
నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రమేష్ బాబు గురించి. తనకు ఇది డెబ్యూ ఫిల్మ్. అయినా సరే అన్ని రకాల ఎమోషన్స్ ని చక్కగా క్యారీ చేసి మంచి నటుడు అనిపించుకున్నాడు. వంకలు పెట్టడానికి వీలులేని నటనతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు రమేష్ బాబు. ఫైట్స్, డ్యాన్స్ లు కూడా బాగా చేసి, శభాష్ అనిపించుకున్నాడు. విజయ రంగరాజు, జీవా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఆడియన్స్ ని రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళుతుంది. కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా అసహజత్వానికి, తావు లేకుండా చక్కగా నటించారు.
సాంకేతిక నిపుణుల పని తీరు:
దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేసిన రమేష్ బాబు… రైటర్ గా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ మరీ హెవీ అయ్యాయేమో అనిపిస్తుంది. అలాగే… ముందే చెప్పుకున్నట్టు ఒక సినిమాలో అన్ని జోనర్లు చొప్పించడం అవసరమా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా… ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ చాలా బాగున్నట్లే. ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది. ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్, కులు మనాలిలో చిత్రీకరించిన పాట, పోరాటాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.
ఫైనల్ గా చెప్పాలంటే…
మల్టీ జోనర్ ఫిల్మ్ గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసిన తీరు అభినందనీయం. కథ మలుపులు తిరిగేకొద్దీ రక్తి కట్టిస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా… చక్కని వినోదంతో ఆడియన్స్ కి విసుగు తెప్పించకుండా రిలాక్స్ మూడ్ తో సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తుంది “నేను – కీర్తన”.
రేటింగ్ : 3/5