కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది. ప్రపంచమంతట కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్ కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్స్ చూస్తే నాకు సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూసారో అర్థం అవుతుంది. చిత్ర బృందం తరఫున, తెలుగు వారి అందరి తరుపున ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరికీ నా థాంక్స్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరిని గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాము కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తరువాత జరిగిన సంఘటన తెలిసి చాల బాధ కలిగింది. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను” అంటూ ముగించారు.