కొరియన్ కనకరాజు విజయం అందరిలో గొప్ప ఆనందాన్ని నింపింది – మెగాస్టార్ చిరంజీవి

కొరియన్ కనకరాజు విజయం అందరిలో గొప్ప ఆనందాన్ని నింపింది – మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ విషయాన్ని చూస్తున్నాను. అది మరోసారి ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఫంక్షన్ ఎప్పుడు పెడతారు, దాని గురించి నాలుగు మాటలు మాట్లాడాలని ఉంది అని అనుకున్నాను. వరుణ్ ఈ వేడుకకు రమ్మని అన్నప్పుడు కచ్చితంగా వస్తానని చెప్పాను. ఇలాంటి విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు తెలియజేయడం మనందరి బాధ్యత. ఒక సినిమా విజయం సాధిస్తే నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ఎంతోమందిలో సంతోషం నింపుతుంది. ప్రతి ఒక్కరూ గుండెల నిండా ఆనందంతో ‘కొరియన్ కనకరాజు’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం దర్శకుడు మేర్లపాక గాంధీ. జనాలకు నచ్చే అద్భుతమైన కంటెంట్‌ను అందించారు. ఒక సినిమా విజయంలో దర్శకుడి బాధ్యత ఎంతో ఉంటుంది. గాంధీ అద్భుతమైన దర్శకుడు. తను ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. హారర్ కామెడీ సినిమాలు ఇదివరకు చాలా వచ్చాయి. కానీ ‘కొరియన్ కనకరాజు’లో కొరియన్ ఫ్లేవర్‌ను, ఆ కల్చర్‌ను తీసుకురావడం చాలా గొప్ప ఆలోచన. ఈ విజయంలో ఆ ఆలోచన ప్రధాన కారణం. అందుకు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా ఇంత కమర్షియల్‌గా అందరినీ అలరించిందంటే దానికి మరో ప్రధాన కారణం నా బిడ్డ వరుణ్ తేజ్. వరుణ్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు, కథలు, పాత్రలు చేస్తున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ ఇలా ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఆర్టిస్ట్‌గా నిలబడాలనే తపన అతనిలో ఉంది. నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇదే నమ్మకంతో ముందుకు వెళ్తే ఒక విలక్షణమైన నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు.
వరుణ్‌కి పర్సనల్‌గా ఒక మాట చెప్పాలి. ఇది వరుణ్ సక్సెస్ కాదు.. మా బుడ్డోడు వాయుతేజ్ సక్సెస్. ఈ సక్సెస్‌ను వాయు ఖాతాలో వేయాలి( నవ్వుతూ). తను మా లక్కీ చార్మ్. సినిమా విజయానికి మరొక బలమైన కారణం సత్య. ఈ వేడుకకు రావాలని తను చాలా ఉత్సాహపడ్డాడు. కానీ షూటింగ్ వల్ల రాలేకపోయాడు. సినిమాలో సత్య చాలా అద్భుతంగా చేశాడు. తన కోసం ఈ సినిమాను మరోసారి చూడాలని అనిపించేంత గొప్పగా చేశాడు. రితిక కూడా అద్భుతంగా నటించింది. అలాగే మురళీధర్ గౌడ్ గారు కూడా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాను దర్శకుడు అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయగలిగాడు. అదే ఈ సినిమా తొలి సక్సెస్. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. 2026 సెకండ్ హాఫ్ ‘పెద్ది’ సినిమా హిట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, ‘లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’.. ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు అనే విషయాన్ని ఈ సినిమాలు నిరూపించాయి. ఈ సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లందరికీ అభినందనలు. నా హృదయానికి దగ్గరైన మంచి మనిషి తమన్. తనలో చాలా ఎనర్జీ ఉంటుంది. తను ఈ సినిమాకు తన మ్యూజిక్‌తో ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.
తమన్‌తో నేను కలిసి చేస్తున్న నా సినిమా టీజర్ నా బర్త్‌డేకు రాబోతోంది. దానికి సంబంధించిన బీజీఎం మరో లెవెల్లో ఉంటుంది. ఆ టీజర్ మీకు నచ్చితే అదే మీరు నాకు ఇచ్చే బర్త్‌డే విషెస్. నిర్మాత రాజీవ్ రెడ్డి గారికి, వారి స్నేహితుడు క్రిష్ గారికి, వంశీ, విక్రమ్‌లకు అభినందనలు. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘కొరియన్ కనకరాజు’ మీ అందరికీ నచ్చి మంచి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెదనాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని మంచి విలువలు, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో పెంచారు. ‘కొరియన్ కనకరాజు’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఈ సినిమాకు కావాల్సిన ప్రతి విషయాన్ని సమకూర్చిన మా నిర్మాత రాజీవ్ గారికి, వంశీ అన్నకి, యూవీ క్రియేషన్స్ టీమ్‌కి బిగ్ థాంక్స్. గాంధీ నన్ను చాలా కొత్తగా చూపించారు. రితిక చాలా మంచి కోస్టార్. సత్య షూటింగ్ కారణంగా ఈ వేడుకకు రాలేకపోయాడు. మేమిద్దరం ఈ సినిమా కోసం బ్రదర్స్‌లా కలిసి పనిచేశాం. సత్య ఈ సినిమాకు చాలా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ పెదనాన్న, బాబాయ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పెదనాన్న, అమ్మానాన్న కళ్లల్లో ఎప్పుడూ గౌరవం కనిపించాలి. బాబాయ్ కళ్లల్లో, అన్నయ్య కళ్లల్లో ఆనందం చూడాలి. ఇప్పుడు నేను ఈ మూడు విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మెగా ఫ్యాన్స్‌కి మంచి సినిమా ఇవ్వాలనేది నా ఆలోచన. ఈ సినిమా ద్వారా మీకు ఆనందాన్ని ఇచ్చాననే సంతోషంలో ఉన్నాను. ఆగస్టు 22 నాకు నేషనల్ హాలిడే లాంటిది. ఆ రోజు నేను పెదనాన్న గారి ఇంటికి వెళ్లిపోయేవాడిని. కొరియన్ కనకరాజు విజయంతో ఈ ఆగస్టు నాకు ఇంకా పెద్దది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే డాడీ.
నాగబాబు మాట్లాడుతూ: మేమందరం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మా అన్నయ్య చిరంజీవి గారు. మా అందరికీ ప్రాణవాయువు మా అన్నయ్య. ‘కొరియన్ కనకరాజు’ సినిమా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గారు చాలా మంచి విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. వరుణ్ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. వరుణ్ బాబును చిన్నప్పుడు నాకంటే ఎక్కువగా అన్నయ్యే ఎత్తుకునేవారు. ఆయన అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకు వరుణ్ బాబును తీసుకెళ్లేవారు. వాళ్లిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అన్నయ్య, వరుణ్ బాబు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మాలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అన్నయ్యే పరిష్కరిస్తారు. ఐ లవ్ యూ అన్నయ్య. మా అన్నయ్య ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం, మీ అందరి ఆశీర్వాదం ఉన్నంతకాలం ఇండస్ట్రీలో మేమందరం మంచి విజయాలు సాధిస్తామని నమ్ముతున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ: ఈ రోజుల్లో ఒక సినిమా విజయం సాధించడం చాలా కష్టం. ఇలాంటి మంచి విజయాన్ని సాధించిందంటే దానికి కారణం మంచి టీమ్ వర్క్. అలాగే దర్శకుడు గాంధీ విజన్ కూడా ఈ విజయానికి ప్రధాన కారణం. ఈ సినిమాను మొదటి నుంచి నేను చాలా బలంగా నమ్మాను. సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. రాజీవ్ గారు చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయనలాంటి నిర్మాతల వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఓజీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ‘పెద్ది’ తర్వాత ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ కూడా మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్‌తో ‘తొలిప్రేమ’ తర్వాత మళ్లీ ‘కొరియన్ కనకరాజు’ లాంటి విజయవంతమైన సినిమాకు పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా విజయం కొనసాగుతుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ: సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ‘నవ్వులే నవ్వులు’ అంటూ ట్వీట్ చేశారు. అది మాకు చాలా పెద్ద పోస్టర్ అయింది. ఆయన సినిమా చూసి నచ్చిందని చెప్పడమే కాకుండా, ఈ సినిమాకు నా వంతు సాయం చేస్తానని చెప్పడంతో ఈ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించాం. చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వరుణ్‌తో ‘కంచె’, ‘అంతరిక్షం’ సినిమాలు చేశాం. యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘కొరియన్ కనకరాజు’ను నిర్మించాం. వరుణ్ ప్రతిసారీ తనను తాను విభిన్నంగా, వినూత్నంగా ఆవిష్కరిస్తున్నారు. మేము కలిసి చేసిన మూడు సినిమాలు మూడు ప్రత్యేకమైన సినిమాలు. ఈ సినిమా విజయం మా బ్యానర్‌కు చాలా అవసరం. గాంధీ అద్భుతంగా తీశారు. తమన్ గారు చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ టీమ్ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను. రాజీవ్ గారు చాలా కష్టపడ్డారు, ఎంతో శ్రమ పెట్టారు. టీమ్ నమ్మినదాన్ని ప్రేక్షకులకు అందించింది. ప్రేక్షకులు కూడా అద్భుతమైన విజయాన్ని అందించారు. గ్రేట్ హిట్. చిరంజీవి గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.
డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. టికెట్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. సినిమా విజయవంతంగా రన్ అవుతోందని వింటున్నాను. కాకపోతే ఎక్కడో ఒక చిన్న వెలితి ఉండేది. ఈరోజు చిరంజీవి గారు ఈ వేడుకకు రావడంతో మా విజయానికి ఒక పరిపూర్ణత వచ్చింది. అలాగే నాగబాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఆయన ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలకు, వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్రమ్ అన్నలకు థాంక్యూ. వరుణ్ గారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కాలికి గాయం అయినప్పటికీ ఎంతో చొరవ తీసుకుని ప్రమోషన్స్ చేశారు. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. రితిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో నవ్వుల సునామీ రావడానికి సత్య కూడా ఒక ప్రధాన కారణం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తమన్ తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశారు. థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
రితిక నాయక్ మాట్లాడుతూ: “చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్లో ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు ఇలాంటి మంచి పాత్ర ఇచ్చిన మా దర్శకుడు గాంధీ గారికి థాంక్యూ. మా నిర్మాతలకు ధన్యవాదాలు. వారితో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. వరుణ్ తేజ్ గారితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తమన్ గారికి థాంక్యూ. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ: “చిరంజీవి గారు ఎదురుగా కూర్చున్నప్పుడు ఈ వేదికపై మాట్లాడటం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఇంతలా ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను రెండు పాటలు రాశాను. ఈ రెండు పాటలు సినిమాకు ప్రత్యేకంగా నిలిచాయి. నాకు ఈ అవకాశం కల్పించిన గాంధీ గారికి, మా హీరో వరుణ్ తేజ్ గారికి, మా నిర్మాతలకు, మా సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయం మరింత నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
