
శ్రీనివాస మంగాపురం లో యాక్షన్, ఎమోషన్స్ చాలా రియల్‌గా ఉంటాయి – జై కృష్ణ ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో జై కృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జులై 30న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో విజువల్స్, ఆడియో చాలా యూనిక్‌గా ఉంటాయి. మీరు 100 శాతం ఎంజాయ్ చేస్తారు. శ్రీనివాస్ గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు, మోహన్ బాబు గారు, రాషా… అందరూ అద్భుతంగా చేశారు. ఇందులో అజయ్ గారు రాసుకున్న క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా రియల్‌గా ఉంటాయి. ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. సినిమా అంతా చాలా మంచి ఫ్లోలో సాగుతుంది. చాలా మంచి కథ. ఆడియన్స్‌కి నేను ఫస్ట్ టైం పరిచయం అవుతున్నప్పుడు ఇంత మంచి కథ ఉంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మా టీమ్, డీవోపీ జై కృష్ణ గారు, ప్రొడక్షన్ డిజైనర్ చాలా మంచి వర్క్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి మరో పెద్ద బలం. ఆరు పాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పటివరకు నాలుగు పాటలు మీరు విన్నారు. ఇంకా రెండు పాటలు వినబోతున్నారు. సాంగ్స్ అన్నీ బ్లాక్‌బస్టర్ అవుతాయి. నన్ను నేను నటుడిగా నిరూపించుకోవడం నా మెయిన్ గోల్. మంచి సినిమాలు చేసే నటుడిగా ఉండాలనేది నా లక్ష్యం. ఈ సినిమాతో నేను నిరూపించుకుంటానని నమ్ముతున్నాను. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ గారు, బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిలా నన్ను యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ చాలా గొప్పగా సాగింది. జై కృష్ణ సూపర్ యాక్టర్. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్లో తనను చూశారు. సినిమాలో తన పెర్ఫార్మెన్స్ను చూడబోతున్నారు. తనకు నేను చాలా సార్లు చెప్పాను… తను ఆల్రెడీ పాస్ అయిపోయాడు. డైరెక్టర్‌గా జై కృష్ణకు రాషాకు పాస్ మార్కులు వేశాను. జై కృష్ణ. మహేష్ బాబు గారి లాగా ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండిపోయే హీరో అవుతాడు. ఈ సినిమాను చాలా లొకేషన్స్‌లో షూట్ చేశాం. మధ్యప్రదేశ్‌లోని చందేరికి వెళ్లాం. అక్కడ తెలుగు సినిమా షూట్ చేయడం ఫస్ట్ టైం. సౌత్ నుంచి వెళ్లి అక్కడ షూట్ చేసిన తొలి సినిమా కూడా ఇదే. దత్తు గారు, కిరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి బళ్లారిలో షెడ్యూల్ చేశాం. తిరుపతిలో రెండు పెద్ద షెడ్యూల్స్ చేశాం. తర్వాత బెంగళూరులో టెంపుల్ షెడ్యూల్ చేశాం. ఇది చాలా పెద్ద సినిమా. తెలుగులో ఈ తరహా మేకింగ్‌తో సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, మేకింగ్ వాల్యూస్, విజువల్స్… ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద సినిమా అనే అనుభూతి కలుగుతుంది. మోహన్ బాబు గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు, వాసుకి గారు… అందరూ అద్భుతంగా చేశారు. నేను అనుకున్నట్టే సినిమా గొప్పగా వచ్చింది. మోహన్ బాబు గారితో చందేరి టెంపుల్లో షూట్ చేశాం. ఆయన లుక్ విషయంలో, పెర్ఫార్మెన్స్ విషయంలో చాలా శ్రద్ధ చూపించారు. అలాగే నరేష్ గారి స్వతంత్ర బాబు క్యారెక్టర్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మీకు నరేష్ కనిపించరు… స్వతంత్ర బాబే కనిపిస్తారు. మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మోహన్ బాబు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. జై కృష్ణ, రాషా జోడీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎమోషన్స్ అదిరిపోతాయి. ఇది ఒక మ్యూజికల్ సినిమా. ఫైట్స్ అదిరిపోతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఎప్పుడూ సినిమా చూడమని ఎవరినీ అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఈ సినిమా మీరందరూ చూసి జై కృష్ణను ఆశీర్వదించాలి. సినిమా చాలా బాగుంటుంది. పది నిమిషాల నుంచే ఈ సినిమాలో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. మా టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.
డాక్టర్ నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జై కృష్ణను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను హీరోగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా అనిపించింది. తను కృష్ణ గారి లెగసీని ఒక బాధ్యతగా తీసుకుంటున్నాడు. అలాగే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయంలో తనకు నేను కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నాను. తెలుగు సినిమా లెగసీ చాలా గొప్పది. ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు తెలుగు పరిశ్రమకు రెండు కళ్లు అయితే… కృష్ణ గారు గుండె. ఆ గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. ఎన్నో చారిత్రాత్మకమైన, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశారు. ఫస్ట్ ఫ్యాన్ వరల్డ్ రిలీజ్ సినిమా కూడా పద్మాలయ స్టూడియోస్ నుంచే వచ్చింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ అన్ని భాషల్లో రిలీజ్ అయి, రష్యా వరకు వెళ్లి పాన్ ఇంటర్నేషనల్ విజయాన్ని సాధించింది. అలాగే అశ్వినీ దత్ గారు ఎన్నో మైలురాయి చిత్రాలను అందించారు. అలాంటి ఆయన ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే జెమినీ కిరణ్ గారికి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. అజయ్ భూపతి గారు నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన తీసిన ‘ఆర్ఎక్స్ 100’ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ‘శ్రీనివాస మంగాపురం’ కూడా తెలుగు సినిమా లెగసీలో ఒక పేజీని దక్కించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను. ఇది ఒక ఆడియో-విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. అజయ్ గారు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. రాషా తడానీ ద్వారా మరో అద్భుతమైన హీరోయిన్ మనకు పరిచయం అవుతుంది. ఇందులోని సాంగ్స్, ట్రైలర్, యాక్షన్‌తో జై కృష్ణ ఇప్పటికే అద్భుతంగా ల్యాండ్ అయ్యాడు. ఇందులోని ప్రేమకథ ప్రతి యువతకు ఎక్కడో గుచ్చుకుంటుంది. యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి. జై కృష్ణను చూస్తుంటే నా దగ్గర ఉన్న కృష్ణ గారి ఫొటో గుర్తుకొచ్చింది. మహేష్ బాబు తర్వాత అంత మంచి సత్ప్రవర్తన జై కృష్ణలో చూశాను. తను చాలా దూరం వెళ్తాడు. నేను కచ్చితంగా చెబుతున్నాను… ఈ సినిమాతో హిట్ కొడుతున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకులు కృష్ణ గారి కోసం, మహేష్ బాబు గారి కోసం, ఒక అద్భుతమైన సినిమా కోసం వస్తారు. ఈ సినిమాలో నేను మర్చిపోలేని క్యారెక్టర్ చేశాను. ఇది నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జై కృష్ణ ఒక పెద్ద హిట్‌తో లాంచ్ అవుతున్నాడు. అందరూ ఈ సినిమాకు పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. నేను కృష్ణ గారి అభిమానిని. జై కృష్ణ చాలా మంచి నటుడు. హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా సెన్సిబుల్. సినిమా గురించి బాగా చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. మంచి సినిమాలు చేయాలనే తపన తనలో కనిపించింది. తప్పకుండా తను మంచి సినిమాలు చేస్తాడని అనుకుంటున్నాను. ఇందులో మోహన్ బాబు గారి కాంబినేషన్లో కూడా చేశాను. అజయ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. చాలా మంచి ఫిల్మ్‌మేకర్. నరేష్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. చాలా మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది. మిగతా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం.
నటుడు శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జై కృష్ణకి డైలాగ్ డెలివరీ చాలా గొప్ప బలం అవుతుంది. తను చాలా అద్భుతంగా నటించాడు. అజయ్ భూపతి గారి దర్శకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డీవోపీ జై కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. వైజయంతి మూవీస్, కిరణ్ గారు, అజయ్ భూపతితో కలిసి పని చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. జై కృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. అయితే ఎక్కడా కూడా ఇది ఆయన తొలి సినిమా లాగా అనిపించదు. జై కృష్ణ చాలా అద్భుతంగా చేశారు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
