
గుర్తుకొస్తున్నాయి ట్రైలర్ చాలా నచ్చింది – బోయపాటి శ్రీను
యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరిస్ ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 3 నుంచి ఈటీవీ విన్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి అతిధులుగా పాల్గొన్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు భాగ్యరాజ్ గారి మరణ వార్త చాలా బాధాకరం. ముందుగా ఆయనను స్మరించుకుంటూ మౌనం పాటిద్దాం. మన ఇండస్ట్రీలో నేను పని చేసిన గొప్ప సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ‘సరైనోడు’ సినిమా సమయంలో బన్నీ బాబుతో చేసిన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ప్రయాణంలో ఎంతోమంది పరిచయమయ్యారు. ఈరోజు వారందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అందులో శరత్ కూడా ఒకరు. శరత్ ఒక మంచి కథను వెబ్ సిరీస్‌గా రూపొందించి, దాన్ని రిలీజ్ చేయడానికి ఈటీవీ విన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తనకు ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావడమే ఒక విజయం. గీతా ఆర్ట్స్, ఈటీవీ విన్ రెండూ కూడా అత్యుత్తమ కంటెంట్‌ను అందించే సంస్థలు. అలాంటి సంస్థల్లో ఈ సిరీస్ విడుదల కావడం గొప్ప విషయం. ఈ విజయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ ఈజ్ ది కింగ్. ఇటీవల వచ్చిన సింగీతం, బ్లాస్ట్, మా ఇంటి బంగారం వంటి చిత్రాలు అద్భుతంగా విజయం సాధించాయి. అదే వరుసలో ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సిరీస్‌కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ నుంచి ధీరజ్ గారు, ఎస్కేఎన్ గారు, శరత్ గారు, బన్నీ వాసు గారు… ఇలా ఎంతోమంది నిర్మాతలుగా రావడం, అందరూ సక్సెస్‌ఫుల్‌గా మంచి సినిమాలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. శరత్ మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈటీవీ విన్ అద్భుతమైన కంటెంట్‌ను అందిస్తోంది. విరాజ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. నేను, బన్నీ వాసు గారు ఒకే కమ్యూనిటీలో ఉంటాం. మొన్న ఒకసారి లిఫ్ట్‌లో బన్నీ వాసు గారు కలిశారు. ‘బన్నీ గారిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను’ అని చెప్పారు. నన్ను కూడా రమ్మన్నారు. అక్కడ వారందరినీ కలిసి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ ఇలా ఒక చోట కలిసి ఉండటం చాలా మంచి విషయం. ‘గుర్తుకొస్తున్నాయి’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజుల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు అని వేర్వేరుగా లేవు. ఆ రెండింటి మధ్య ఉన్న గీత చెరిగిపోయింది. మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా ప్రేక్షకులు పూర్తిగా ఆదరిస్తారు. ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను మేము ఎప్పటికీ మర్చిపోలేం. హీరో సత్యదేవ్ గారికి, దర్శకుడు కరుణాకర్ గారికి, బోయపాటి శ్రీను గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఈరోజు గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. బేబీ సినిమా దగ్గర నుంచి వాళ్లందరూ నాకు ఒక ఫ్యామిలీలా మారిపోయారు. సాయిరాజేష్ గారు నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, బన్నీ వాసు గారు చేసిన సపోర్ట్ ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. శరత్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇందులో నా పాత్ర తన గతాన్ని మర్చిపోతుంది. ట్రైలర్లో మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకుని, ఎన్నో భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా కనెక్ట్ చేశారు. ఈ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి నాకు కూడా ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాలాగే మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. శరత్ గారిలో ఒక మంచి రచయిత కూడా ఉన్నారు. వినోద్‌కి దర్శకుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఆయన ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇందులో ఎమోషన్స్, ఫన్నీ సీక్వెన్స్‌లు, ఎంటర్టైనింగ్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి. అజయ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. యశశ్రీ తెలుగు నేర్చుకుని మరీ చాలా చక్కగా నటించింది. తప్పకుండా ఈ సిరీస్ మీ అందరికీ నచ్చుతుంది. శరత్ గారు మా టీజర్‌ను బన్నీ అన్నకు చూపించారు. ఆయన మాకు అందరికీ ఇన్స్పిరేషన్. అలాగే మొదటి నుంచి మాకు అండగా నిలుస్తున్న అల్లు అరవింద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఒక హీరో టీమ్ నుంచి ఇంతమంది నిర్మాతలు రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన విషయం గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ గారి క్యాంప్‌లో జరిగింది. ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి నిర్మాత తమ స్థాయిలో మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విరాజ్ హీరోగా మాత్రమే కాదు, అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. ఏ పాత్ర చేసినా మంచి పేరు సంపాదించుకుంటారని నమ్ముతున్నాను. అజయ్ చాలా చక్కని సంగీతాన్ని అందించారు. అలాగే ఈ సిరీస్‌కు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ నా అభినందనలు. ఈటీవీ విన్ ఇప్పటికే ఎన్నో హిట్ వెబ్ సిరీస్‌లు, థియేటర్లలో విజయవంతమైన సినిమాలు అందించింది. ఒక మంచి టీమ్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సాధించవచ్చని చెప్పడానికి ఈటీవీ విన్ ఒక నిదర్శనం. అలాంటి ఈటీవీ విన్ నుంచి మరెన్నో మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు రావాలని కోరుకుంటున్నాను. శరత్ ఏ పని చేసినా మనసుపెట్టి చేస్తాడు. తనలో చాలా ప్రతిభ ఉంది. తను మరెన్నో మంచి సినిమాలు నిర్మించి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధీరజ్ మాట్లాడుతూ.. ఈ వేదిక ఎంత నిండుగా ఉందో, మా శరత్ మనసు కూడా అంతే నిండుగా ఉంటుంది. తను చాలా కష్టపడతాడు. మా సంస్థలో అందరికీ ఎంతో సపోర్టివ్‌గా ఉంటూ, ఎప్పుడూ అందరి మంచి కోరుకునే వ్యక్తి. తను తొలిసారి నిర్మాతగా ఈ సిరీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం సాధించి, తనకు మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో మరెన్నో ఫీచర్ ఫిల్మ్స్ కూడా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘బేబీ’ సినిమాకు ప్రాణం పోసిన వారిలో విరాజ్ కూడా ఒకరు. విరాజ్ మరెన్నో మంచి సినిమాలు చేసి, గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బన్నీ వాసు మాట్లాడుతూ.. మొన్న నా సినిమా లాంచ్ అయ్యింది. ఈరోజు ఉదయం మా బ్యాచ్‌లో సందీప్ తన సినిమాను ప్రారంభించాడు. ఈరోజు మధ్యాహ్నం శరత్ సినిమా వేడుకకు వచ్చి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి బన్నీ అనే గమ్యస్థానానికి చేరుకున్నాం. అక్కడి నుంచి ఒక్కొక్కరం ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతున్నామంటే దానికి బన్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. తన వల్లే ఈ సక్సెస్ వచ్చింది. నేను, ఎస్కేఎన్, శరత్… మేమందరం చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడి నుంచి శరత్ జర్నీ ఇంకా చాలా బాగుండాలి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో నన్ను, వంశీ నందిపాటిని భాగం చేసుకుని ఈటీవీ విన్ మాకు ఎంతో మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఈటీవీ విన్ శరత్‌కు నిర్మాతగా అవకాశం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ చేసింది. విరాజ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. నిజంగా అది చాలా మంచి స్ట్రాటజీ. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. శరత్ జీవితంలో ముందుకు వెళ్లాలనే తపన ఉన్న వ్యక్తి. ఈరోజు తను ఈ సిరీస్‌తో నిర్మాతగా రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత చాలామంది నటీనటులకు అవకాశాలు వచ్చాయి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ స్టార్ట్ అయింది. ఈటీవీ అంటే అది మా సొంత సంస్థలాగే అనిపిస్తుంది. ఈటీవీ విన్లో వస్తున్న ఈ సిరీస్‌ను ఎవరూ మిస్ అవ్వరు. ఇది కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. ఈ క్యారెక్టర్ విరాజ్ కోసమే పుట్టిందేమో అన్నట్టుగా ఆయన నటించారు. ఈ సిరీస్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సిరీస్ చూస్తే కచ్చితంగా మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు.
నిర్మాత శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బోయపాటి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘గుర్తుకొస్తున్నాయి’ గురించి చెప్పాలంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. ముందుగా అల్లు అర్జున్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను మొదట ఆయన వద్ద సోషల్ మీడియా హ్యాండిల్ చేశాను. తర్వాత పీఆర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. ఇప్పుడు నిర్మాతగా ఈటీవీ విన్లో ఒక సిరీస్ చేయడం వరకు వచ్చాను. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడానికి ప్రధాన కారణం సాయి గారు. ఈ ప్రయాణంలో ఆయన ఎంతో సహకరించారు. దర్శకుడు వినోద్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సిరీస్ అద్భుతంగా వచ్చింది. యశశ్రీ చాలా అద్భుతంగా నటించింది. ‘బేబీ’ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్న విరాజ్‌కు థాంక్స్. వెబ్ సిరీస్‌లకు అవార్డులు ఇస్తే, ఈ సిరీస్‌కు తప్పకుండా అవార్డులు వస్తాయి. విరాజ్ అంత చక్కగా నటించాడు. ఈ సిరీస్‌లో వంశీ నందిపాటి గారు నటుడిగా అరంగేట్రం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ.. ‘గుర్తుకొస్తున్నాయి’ అనే టైటిల్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. గీతా ఆర్ట్స్, ఈటీవీ విన్ రెండూ ప్రతిష్టాత్మక సంస్థలు. అలాంటి రెండు సంస్థల నుంచి వస్తున్న ఈ సిరీస్ తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇలాంటి కంటెంట్‌తోనే మంచి ప్రొడక్షన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఇలాంటి సిరీస్‌ల నుంచే గొప్ప ఆర్టిస్టులు వస్తారు. ఇండస్ట్రీకి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ సిరీస్ పెద్ద హిట్ అయి నిర్మాత శరత్‌కు మంచి పేరు తీసుకురావాలని, టీమ్ అంతా విజయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన సత్యదేవ్ గారికి, బోయపాటి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జూలై 3న థియేటర్లలో ‘రావు బహదూర్’ చూడండి… ఇంట్లో ఈటీవీ విన్లో ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ చూడండి. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను ఉచితంగా చూడొచ్చు. ఈ సిరీస్ పేరు ‘గుర్తుకొస్తున్నాయి’… అలాగే ఇది కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.”
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ మాట్లాడుతూ.. “ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇంత మంచి సిరీస్ నా తొలి ప్రాజెక్ట్ కావడం మరింత ఆనందంగా ఉంది. ‘గుర్తుకొస్తున్నాయి’ ఒక అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన సిరీస్. ఈ వీకెండ్ మీ కుటుంబంతో కలిసి ఎంతో హాయిగా చూడొచ్చు. ఈ సిరీస్‌ను మాకు అందించిన శరత్ గారికి ధన్యవాదాలు. జూలై 3 నుంచి ఈటీవీ విన్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.
