The Maze Will Surprise Audiences with Its Unique Thriller Concept

Animated Film Heart Across the Sea Premiere held in Hyderabad
హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన ‘హార్ట్ అక్రాస్ ది సీ’ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ప్రీమియర్
రిట్జ్ ఆర్ట్ హౌస్, అమెరికా నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ‘హార్ట్స్ అక్రాస్ ది సీ’ (Hearts Across the Sea) ప్రత్యేక ప్రీమియర్ హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ జరిగింది. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీమియర్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
డా. అపర్ణ వొల్లూరు (Dr. Aperna Volluru) క్రియేట్ చేసిన మూలకథ, పాత్రల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఆంటోనియో ఆండ్రియాజ్జో (Antonio Andreazzo) దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రసాద్ గారపాటి నిర్మాతగా, మణీంద్ర కుమార్ (Maneendra Kumar) ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ చిత్రం నిడివి 24 నిమిషాల 48 సెకన్లు.
అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో నివసించే బీవర్ కుటుంబం, వారి స్నేహితులు ‘వ్యాలీ హార్ట్’ అనే నౌకలో చేపట్టే సముద్రయాత్ర చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇటలీలోని వెరోనా నగరాన్ని చూడాలన్న భార్య కలను నెరవేర్చేందుకు భర్త చేసే ప్రయత్నం… స్నేహం, ధైర్యం, అనుకోని సవాళ్లు, పరస్పర సహకారంతో కూడిన సాహసయాత్రగా మారుతుంది. ఒరెగాన్ నుంచి వెనిస్ మీదుగా వెరోనా వరకు సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తుంది.
“ప్రేమ అనేది మనం అనుభూతి చెందేది మాత్రమే కాదు… మన చేతల్లో చూపించేది కూడా” అనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.
మానవ కళాకారులు సృష్టించిన చిత్రాలకు ఏఐ సహకారంతో చలనరూపం ఇవ్వడం ఈ నిర్మాణంలోని ప్రత్యేకత. పాత్రల రూపకల్పన, పరిసరాలు, కెమెరా కూర్పులను కళాకారులే రూపొందించారని చిత్రబృందం తెలిపింది. అనంతరం ఏఐ ఆధారిత ఇమేజ్-టు-వీడియో సాంకేతికతతో వాటిని యానిమేట్ చేశారు. స్క్రీన్ప్లే, సంభాషణలు, సంగీతాన్ని జనరేటివ్ ఏఐ ఉపయోగించకుండా సృష్టించినట్లు పేర్కొన్నారు.
మూలకథ, పాత్రలక్రియేటర్ డా. అపర్ణ వొల్లూరు మాట్లాడుతూ: “సముద్రాలను, సంస్కృతులను దాటి సాగే ఈ ప్రయాణం ద్వారా దయ, సహానుభూతి, స్నేహం ఎంతటి తుఫానునైనా ఎదుర్కోగలవని చెప్పాలనుకున్నాను. ప్రేమ అనేది మాటల్లోనే కాదు, మనం చేసే పనుల్లోనూ కనిపించాలనేది ఈ కథ వెనుక ఉన్న ఆలోచన.”
మై స్కూల్ ఇటలీ చైర్మన్, చిత్ర నిర్మాత ప్రసాద్ గారపాటి మాట్లాడుతూ:”మా తరగతి గదుల్లో పిల్లలకు స్ఫూర్తినిచ్చిన పాత్రలు ఇప్పుడు తెరపై ప్రాణం పోసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యా కథలు తరగతి గదుల నుంచి యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అందమైన ప్రయాణానికి ఈ చిత్రం ప్రతీక.”
దర్శకుడు, నిర్మాత ఆంటోనియో ఆండ్రియాజ్జో మాట్లాడుతూ: “నా కుటుంబ మూలాలు ఇటలీలోని వెనెటో ప్రాంతంలో ఉండటంతో వెనిస్, వెరోనా నగరాలు నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒరెగాన్లోని మా అటవీ పాత్రలను ఇటలీకి తీసుకెళ్లే మరపురాని ప్రయాణాన్ని చూపించాలనుకున్నాను. స్నేహం, సాహసం, ప్రేమ ద్వారా రెండు ప్రపంచాలను కలిపే ప్రయత్నమే ఈ చిత్రం.”
చిన్నారులు, కుటుంబ ప్రేక్షకుల కోసం రూపొందిన ఈ చిత్రాన్ని మరింత విస్తృతమైన ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా హైదరాబాద్ ప్రీమియర్ ఒక ముఖ్యమైన ముందడుగని రిట్జ్ ఆర్ట్ హౌస్ తెలిపింది.
