VB Entertainments Vendithera and OTT Awards event held grandly in

రంభ ఊర్వశి మేనక లో అల్లరి నరేష్ గారి కామెడీ ర్యాంపేజ్ ఉంటుంది – చంద్ర మోహన్ చింతాడ
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ఈ టైటిల్ వెనుక ఉన్న కథ ఏమిటి?
-సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం చాలా ఆత్రుతగా ఉంటాం. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఏదో ఒక సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై మన కోరిక తీర్చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. అలాంటి ఒక మ్యాజిక్ లాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. ఆ తర్వాత ఈ ఐడియాకు స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెట్టాను.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
-మాది వైజాగ్. మా నాన్నగారు బీఎస్ఎన్ఎల్లో ఎంప్లాయ్. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. దర్శకుడు కరుణాకరన్ గారి దగ్గర ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ సినిమాలకు పనిచేశాను.
ఈ కథ నేపథ్యం ఏమిటి?
-ఒక వ్యక్తి తనకు అనుకున్నది జీవితంలో సాధించాలనుకుంటాడు. హీరో కావాలనేది అతని కోరిక. అందుకోసం హైదరాబాద్, చెన్నై వెళ్లి ప్రయత్నించాలి. కానీ తాను ఉన్న ఊర్లోనే ఉండి హీరో అవ్వాలని అనుకుంటాడు. ఏదో ఒక మ్యాజిక్ జరిగి తన కోరిక నెరవేరాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో అతని కుటుంబంలో ఉన్న ఒక పుస్తకం గురించి తెలుసుకుంటాడు. ఆ పుస్తకంపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని కరెక్ట్‌గా గీస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. దాని కోసం అతను దాదాపు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటాడు. చివరికి నిజంగానే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. వాళ్లు దిగకముందు ఏం జరిగింది? దిగిన తర్వాత ఏం జరిగింది? అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అల్లరి నరేష్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన ఎలా ఫీలయ్యారు?
-నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఫీలయ్యారు. చాలా కమర్షియల్‌గా ఉందని చెప్పారు. నరేష్ గారితో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
-ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల ఎపిసోడ్‌ను నేను ఇప్పటివరకు ఎక్కడా రివిల్ చేయలేదు. అది ఆడియన్స్‌కు బోనస్‌గా ఉంటుంది.
-నరేష్ గారి కామెడీ యూనివర్సల్‌గా అందరికీ నచ్చుతుంది. ఆయన అన్ని జనరేషన్స్‌కు తెలిసిన హీరో. యూట్యూబ్‌లో, శాటిలైట్ ఛానల్స్‌లో ఆయన సినిమాలు నిరంతరం ఆడుతూనే ఉంటాయి. గత కొంతకాలంగా ఆయన విభిన్నమైన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ తన కంఫర్ట్ జోన్లోకి వస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ గారి కామెడీ ఫుల్ ర్యాంపేజ్‌లో ఉంటుంది.
-నరేష్ గారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఆయన క్యారెక్టర్‌పై ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో కామెడీ అంటే అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లిపోతోంది. మీరు కామెడీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఈ విషయంలో నాకు త్రివిక్రమ్ గారు స్ఫూర్తి. వల్గర్‌గా ఒక మాట చెప్పి నవ్వించొచ్చు. ప్రేక్షకులు ఆ సమయంలో నవ్వి తర్వాత మర్చిపోతారు. కానీ ఒక మంచి పదంతో, మంచి మాటతో నవ్వు పుడితే అది చాలా కాలం గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను.
-ఈ సినిమాలో కామెడీ చాలా జెన్యూన్‌గా, ప్యూర్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన నవ్వులు ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది.
వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సామాన్య మనిషికి, దేవతల రాజు ఇంద్రుడికి మధ్య జరిగే సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా, వినోదాత్మకంగా ఉంటాయి.
-అలాగే సీనియర్ నరేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వంటి చాలా అనుభవం ఉన్న నటులు ఇందులో ఉన్నారు. అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
సినిమాలో భారీగా CG వర్క్ ఉందని తెలుస్తోంది. నిర్మాతల సపోర్ట్ ఎలా ఉంది?
-దాదాపు 35 నిమిషాల వరకు ఇందులో CG వర్క్ ఉంటుంది. ఈ విషయంలో నిర్మాతలకు థాంక్స్ చెప్పాలి. నాకు కావాల్సిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు.
-అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీలో అందరూ అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారి అభిమానులు. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా చూపించారు. అక్కినేని కుటుంబం అంటే మా ఫ్యామిలీకి చాలా అభిమానం. అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. రాజేష్ దండా గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.
హీరోయిన్స్ గురించి?
సురభి, రాశి సింగ్, ప్రిషా, విష్ణుప్రియ అందరూ తమ పాత్రలకు చాలా బాగా సరిపోయారు. వాళ్ల స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. ఈ పాత్రలకు వాళ్లు పర్ఫెక్ట్గా ఉంటారు.
మ్యూజిక్ గురించి?
చేతన్ భరద్వాజ్ నాలుగు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్స్, నరేష్ గారి మీద వచ్చే ఒక పాట ఉంటుంది. అది థియేటర్లో బద్దలైపోతుంది.
ప్రస్తుతం ఆడియన్స్ కామెడీ రైటింగ్ మారిపోయింది. దీనికి తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కామెడీకి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది. రైటర్ నందు కథ చెప్పగానే వెంటనే దానికి తగ్గట్టుగా అల్లుకుపోతాడు. అద్భుతమైన డైలాగ్స్ రాశాడు.
దర్శకుడిగా మీకు బలమైన జోనర్ ఏమిటి?
-నా బలం కామెడీ. నా తొలి సినిమా ఫాంటసీ కామెడీ కావడం చాలా హ్యాపీగా ఉంది.
సినిమాని ఎవరికైనా చూపించారా?
-ఇన్నర్ సర్కిల్స్‌లో కొంతమందికి చూపించాం. అందరూ అదిరిపోయింది అని చెప్పారు.
ఆల్ ది బెస్ట్.
-థాంక్యూ
