
నాగబంధం విజువల్ గా మెస్మరైజ్ చేస్తుంది – డీవోపీ ఎస్. సౌందరరాజన్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ ఎస్. సౌందరరాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నాగబంధం ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
-నేను ఇంతకుముందు అభిషేక్ గారితో డెవిల్ సినిమా చేశాను. అప్పటి నుంచి ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. అభిషేక్ గారు చాలా పెద్ద విజన్‌తో ఈ కథను మొదలుపెట్టారు. నేను స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యాను. నాగబంధం ఐడియా మా అందరినీ ఎంతగానో ఉత్సాహపరిచింది. మొదట కథను లాక్ చేశాం. తర్వాత దాన్ని విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించాలనే దానిపై ప్లాన్ చేశాం.
ఇందులో మీకు చాలెంజింగ్‌గా అనిపించిన వర్క్ ఏంటి?
-నేను ఇంతకుముందు ఫాంటసీ సినిమాలు చేశాను. విజువల్స్‌ను గ్లామరైజ్ చేసి, ఎలివేట్ చేసేలా కూడా చేసిన అనుభవం ఉంది. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. చాలా నేచురల్ స్టైల్లో ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా సహజమైన లైటింగ్‌తో, కథలో లీనమయ్యేలా తీశాను. ఎక్కడా ఓవర్ గ్లామర్ చేయడం గానీ, అనవసరమైన డ్రామా సృష్టించడం గానీ చేయలేదు.
చాలా భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్తో వస్తున్న సినిమా కదా. డీవోపీగా మీకు ఎలాంటి ఛాలెంజ్‌గా అనిపించింది?
-విజువల్ ఎఫెక్ట్స్‌ను మనం రెండు రకాలుగా వాడుతుంటాం. ఒకటి గ్రాండియర్ కోసం, మరొకటి రియల్‌గా అనిపించేందుకు. అయితే ఆ విజువలైజేషన్ సహజంగా కనిపించడం చాలా పెద్ద టాస్క్. చాలామందిని తీసుకెళ్లి హిమాలయాల్లో షూటింగ్ చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అలాంటి సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగపడతాయి. కానీ వాటిని సహజంగా, నిజంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ అన్నీ కూడా చాలా నేచురల్‌గా, రియల్‌గా ఉంటాయి.
ఈ సినిమాలో విజువల్స్ అన్నీ చాలా రియల్‌గా కనిపిస్తున్నాయి. మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు?
-నేను, డైరెక్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కలిసి చాలా దేవాలయాలు తిరిగాం. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించాం. అక్కడ ప్రతి అంశాన్ని డీటెయిల్‌గా ఫొటోగ్రాఫ్ చేశాం. అదే ఆలయాన్ని ఆధారంగా చేసుకున్నప్పటికీ సినిమాలో “శ్రీరంగపురం” అనే పేరు పెట్టాం. శ్రీరంగం, తిరువనంతపురం ప్రాంతాల వైభవాన్ని కలిపేలా ఆ పేరు నిర్ణయించాం. ఆ దేవాలయానికి సంబంధించిన అంశాలపై చాలా రీసెర్చ్ చేశాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు అద్భుతమైన సెట్లు వేశారు. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్లోకి అడుగుపెడితే నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతంగా ప్రతి సెట్‌ను తీర్చిదిద్దారు.
-ఇంతకుముందు కూడా పెద్ద సినిమాలు చేశాను. కానీ ఇంత భారీ స్థాయిలో సెట్లు ఉన్న సినిమాను నేను ఎప్పుడూ చేయలేదు. అంత పెద్ద సెట్లను లైటింగ్ చేయడం, హై స్పీడ్‌లో షూట్ చేయడం చాలా చాలెంజింగ్ వర్క్. షూటింగ్ భారీ స్థాయిలో జరిగింది.
డైరెక్టర్ అభిషేక్ గారి గురించి?
-ఆయన అద్భుతమైన కథను రాసుకున్నారు. ఆ ఆలోచన మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దర్శకుడిగా ఆయన అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆయన క్లారిటీ, విజువల్ సెన్స్, కోఆర్డినేషన్ అన్నీ అద్భుతం. ప్రతి విభాగం నుంచి బెస్ట్ ఔట్పుట్ రాబట్టుకున్నారు.
ఇందులో ఒక ఎపిసోడ్ చేయడానికి 10 కోట్లు అయ్యిందని విన్నాం?
అవును. మేము ఒక్కో అంశాన్ని ఇంప్రోవైజ్ చేసుకుంటూ వెళ్లాం. ఒక సెట్ డిజైన్ చేసిన తర్వాత ఇంకా గ్రాండ్‌గా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా గొప్ప స్థాయిలో సినిమాను తెరకెక్కించాం.
షూటింగ్ ఎక్కడ చేశారు?
-హైదరాబాద్, కేరళ, తమిళనాడు, అలాగే హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం.
నిర్మాతల గురించి?
అభిషేక్ నామా గారి విజన్‌కు నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్టుగా చాలా గ్రాండ్ స్కేల్లో సినిమాను నిర్మించారు. మా నిర్మాతలకు సినిమా అంటే చాలా పాషన్. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాని నిర్మించారు.
హీరో విరాట్ కర్ణ గురించి?
విరాట్ కర్ణ చాలా కమిట్మెంట్ ఉన్న నటుడు. ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. డిసెంబర్, నవంబర్ నెలల్లో తీవ్రమైన చలిలో కూడా అండర్‌వాటర్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. జ్వరంతో కూడా షూట్ కి వచ్చారు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఈ సినిమా చేశారు. ఆయన కమిట్మెంట్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సినిమా మేజర్ హైలట్ ఏమిటి?
-ఈ సినిమా హైలైట్ అనంత పద్మనాభస్వామి టెంపుల్, అక్కడ జరిగే సన్నివేశాలు. అవి అద్భుతంగా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అది చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది.ఈ సినిమా భారీ విగ్రహాన్ని రూపొందించాం. ఈ వర్క్ లో దేశంలోని ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.
-ఇందులోని విజువల్స్ అన్నీ చాలా అథెంటిక్‌గా ఉంటాయి. షూటింగ్ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి భావంతో ఉండేవారు. చెప్పులు బయటే వదిలి సెట్స్‌లోకి వచ్చేవారు. అలాగే షూటింగ్ ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా నియమించిన అర్చకుడు పూజలు నిర్వహించిన తర్వాతే షూటింగ్ చేసేవాళ్లం.
-ఈ సినిమాలో మైథాలజీ, ఫిక్షన్, డ్రామా అన్నింటినీ మిళితం చేస్తూ ఒక విజువల్ ఫీస్ట్‌లా మలిచాం. అలాగే ట్రావెన్కోర్ ప్రధాన అర్చకుడిని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకుని, చాలా చిన్న చిన్న డీటెయిల్స్‌ను కూడా సినిమాలో పొందుపరిచాం.
ఈ సినిమా కోసం కెమెరా వర్క్ పరంగా కొత్త ఎక్విప్మెంట్ ఏదైనా ఉపయోగించారా?
-చాలా పెద్ద సెట్లలో తీసిన సినిమా ఇది. ఆ మొత్తం సెట్‌ను ఒకే షాట్లో చూపించడం నాకు చాలెంజ్‌గా అనిపించింది. అందుకోసం చాలా ఖరీదైన డ్రోన్‌ను ఉపయోగించాం. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి పద్మనాభస్వామి విగ్రహం వరకు ఒకే షాట్లో చిత్రీకరించాం. దాని కోసం చాలా రిహార్సల్స్, అనేక టేక్స్ తీసుకున్నాం. ఆ షాట్ అద్భుతంగా వచ్చింది.
మ్యూజిక్ గురించి?
-ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా డివైన్‌గా ఉంటుంది. మేము షూటింగ్ చేసినప్పుడే మ్యూజిక్ రిఫరెన్స్‌తో పాటు షూట్ చేసేవాళ్లం. ప్రతి ముఖ్యమైన సీక్వెన్స్‌కు మాకు ముందుగానే మ్యూజిక్ రిఫరెన్స్ ఉండేది. దాంతో కెమెరా వర్క్ కూడా మరింత ఎన్హాన్స్ అయింది.
‘నాగబంధం’ విజువల్‌గా ఆడియన్స్‌కు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
-ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తూ, ఒక డివైన్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్యూ
